పోలీసుల పేరుతో సైబర్ మోసాలు
అధికారి పేరుతో ఫోన్లు.. ఫోన్‌పే ద్వారా నగదు బదిలీలు
తెలంగాణ, ఏపీలో 28కు పైగా కేసులు.. రూ.15 లక్షల వరకు మోసాలు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన చందుర్తి పోలీసులు
నిందితుల నుంచి నగదు, ఫోన్లు, సిమ్ కార్డుల స్వాధీనం
కాకతీయ, చందుర్తి : పోలీసుల పేరుతో అమాయకులను నమ్మించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 వేల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీరిపై 28కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మోతే మండలానికి చెందిన కిలుకాని సాయిచంద్ (30), సూర్యాపేటకు చెందిన కట్కూరి శరత్‌కుమార్ (31) ప్రస్తుతం హైదరాబాద్ మీర్పేట్లో నివాసం ఉంటున్నారు. గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ-సేవ, మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లు సేకరించి పోలీసు అధికారుల పేరుతో బాధితులకు ఫోన్లు చేసేవారు. తమను చందుర్తి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిగా పరిచయం చేసుకుని, ఆస్పత్రి ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించేవారు. అనంతరం ముందుగానే మాట్లాడుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది నంబర్‌కు ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకుని, అక్కడి నుంచి నగదును తీసుకునేవారు. ఇదే తరహాలో చందుర్తి మండలానికి చెందిన చిలుక పెంటయ్యకు ఫోన్ చేసి, తన కుమారుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పి రూ.70 వేలు పంపించుకున్నారు. అనంతరం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన పెంటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. బాధితుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన చందుర్తి సీఐ రవీందర్, ఎస్ఐ రమేష్, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డిలను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

