ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఖమ్మం జిల్లాలో 10,85,927 మంది ఓటర్లు
1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల నోటీసులు
అర్హులైన కొత్త ఓటర్లు ఫారమ్-6తో నమోదు చేసుకోవచ్చు
ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం : ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం సోమవారం ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రక్రియ వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 10,85,927 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదలైందని కలెక్టర్ తెలిపారు. ఇందులో 5,24,894 మంది పురుషులు, 5,60,973 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ముసాయిదాలో 1,33,004 మంది ఓటర్లకు అనామలీస్, 43,131 మందికి మ్యాపింగ్ లేదని గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పత్రాలు సమర్పించాలి
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ ఆధారంగా ఎన్నికల సంఘం సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే బూత్ స్థాయి అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి లేదా ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించాలని తెలిపారు. అర్హులైన కొత్త ఓటర్లు ఫారమ్-6 ద్వారా సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చనిపోయిన లేదా డూప్లికేట్ ఓటర్లపై ఫారమ్-7, చిరునామా మార్పు, మొబైల్ నంబర్ నవీకరణ, వివరాల సవరణకు ఫారమ్-8 వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటి పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని చెప్పారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని, సందేహాలుంటే టోల్‌ఫ్రీ 1950కు సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

