ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి ఎంపిక
కొత్తూరు సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్
కాకతీయ,రాయపర్తి: మండలంలోని కొత్తూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ప్రతిష్టాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి ఐ టి)లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఎంపికైనట్లు బుధవారం ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు,ప్రజా ఫిర్యాదుల విభాగం (డి ఎ ఆర్ పి జి ) సౌజన్యంతో సమాచార హక్కు, గ్రామసభ సామర్ధ్య పెంపుదల ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుండి 24 వరకు ఈ ప్రత్యేక వర్క్ షాప్ జరగనుంది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… మహిళా ప్రతినిధులు తమ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) ద్వారా గ్రామ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం తీసుకురావడంలో ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో మహిళా సాధికారత,నాయకత్వ లక్షణాలు,ప్లాస్టిక్ నిర్మూలన,స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి) భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలు,బాలల సంక్షేమ చట్టాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నట్లు సర్పంచ్ తెలిపారు.ఈ ప్రత్యేక కార్యక్రమానికి సర్పంచ్ ఎంపిక కావడం పట్ల గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శి ఆస్మా,పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

