వరంగల్ దసరా ఉత్సవాల్లో పారదర్శకతేది? లెక్కలు చెప్పాల్సిందే!
లక్షల్లో వసూళ్లు, మౌలిక వసతులు మాత్రం ప్రభుత్వానివే.. భక్తుల ఆవేదన
కాకతీయ, వరంగల్, ప్రతినిధి: వరంగల్ లో ఘనంగా జరిగిన దసరా ఉత్సవాల నిర్వహణపై ఇప్పుడు అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ పేరుతో లక్షల్లో చందాలు వసూలు చేస్తున్న నిర్వాహకులు, ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించడం లేదని నగర ప్రజల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.
లక్షల్లో చందాలు.. లెక్కల్లో గందరగోళం.
దసరా ఉత్సవాల పేరుతో నగరంలోని వ్యాపారులు, ప్రజల నుంచి లక్షల రూపాయల చందాలు వసూలు చేస్తున్నారు. అయితే వసూలు చేసిన మొత్తం ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? అనే వివరాలను ఉత్సవ కమిటీ ఇప్పటివరకు బహిరంగపరచలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానివే మౌలిక వసతులు..
ఉత్సవాలకు కావాల్సిన కరెంట్, శానిటేషన్, రోడ్లు, బారికేడ్లు, భద్రత వంటి 75 శాతం మౌలిక వసతులను వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మరియు ప్రభుత్వ శాఖలే కల్పిస్తున్నాయి. మరి అలాంటప్పుడు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భక్తుల కంటే ఆర్భాటాలకే ప్రాధాన్యమా?
ఉత్సవాల్లో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించడం కంటే, రాజకీయ నాయకుల స్వాగతాలు, ఆర్భాటాలు, ఫ్లెక్సీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల రాత్రి వేళ గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియోలో ఉన్న జనం రద్దీయే ఇందుకు నిదర్శనం.
పోలీసులపై అదనపు భారం
సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో పండుగ వేళ పోలీసు వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు సిబ్బందిని పెట్టాల్సి వస్తోంది.
ప్రజలు ఏం కోరుతున్నారు?
లెక్కలు బహిరంగపరచాలి..
వరంగల్ దసరా ఉత్సవ కమిటీ వెంటనే స్పందించి, ఈ ఏడాది వసూలు చేసిన మొత్తం చందాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలతో కూడిన ఆదాయ, వ్యయ పట్టికను బహిరంగపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది నుండి ప్రభుత్వమే నిర్వహించాలి..
75% పనులు మున్సిపల్ కార్పోరేషనే చక్కబెడుతున్నప్పుడు, చందాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కావున వచ్చే సంవత్సరం నుండి దసరా వేడుకలను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రజలు ఏకగ్రీవంగా కోరుతున్నారు.
ఈ అంశంపై వరంగల్ దసరా ఉత్సవ కమిటీ స్పందించి తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

