అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
* సామజిక సేవకులు ఎర్రోళ్ల రాజా రాకేశ్
కాకతీయ, చేర్యాల: రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు చేర్యాల మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆయన సేవలను స్మరించుకొని అంబేడ్కర్ విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా సామాజిక సేవకులు ఎర్రోళ్ల రాజా రాకేశ్ మాట్లాడుతూ.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అతి కొద్దిమందిలో అంబేడ్కర్ ఒకరని, ఐక్యరాజ్యసమితితో పాటు 132 దేశాల్లో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని రాజా రాకేశ్ అంబేడ్కర్ కీర్తినిచాటారు. ఎన్నో త్యాగాలతో దేశానికి రాజ్యాంగ ఫలాలు అందించిన బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ను స్మరించుకోవడం తో పాటు ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. దేశంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యం అయిందన్నారు. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత దేశంలో భారత రాజ్యాంగం పాటించడం ద్వారా నే ఐకమత్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంబేడ్కర్ ఎంతో పట్టుదలతో 16 డిగ్రీలు పూర్తి చేశారని అన్నారు. ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహిళల హక్కుల కోసం, వారి చదువు కోసం అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.

