రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
దళారులను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వ మద్దతు ధర పొందాలి
సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న సర్కార్
మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ధాన్యం తరలింపు వేగవంతం
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి
కాకతీయ, చిగురుమామిడి: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, అన్నదాతలు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొంది సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం హైదరాబాద్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
మద్దతు ధరతో పాటు బోనస్..
ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ. 2,389 మద్దతు ధరను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు అదనంగా రూ. 500 బోనస్ అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి, యుద్ధ ప్రాతిపదికన తూకం వేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి..
ధాన్యం విక్రయానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ తీవ్రత దృష్ట్యా నీడ సౌకర్యం, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ పటేల్, డీఎం కిష్టయ్య, ఉపసర్పంచ్ చింతపుల అనిల్ కుమార్ పటేల్ పాల్గొన్నారు. అలాగే మండల వ్యవసాయ శాఖ అధికారి పున్నం చందర్ రెడ్డి, హాకా సెంటర్ ఇన్ఛార్జ్ పొన్నం తిరుపతి గౌడ్, వార్డు సభ్యులు నడిగోట్టు కిరణ్, ఎస్.కె. ఉమర్, అందే తిరుపతి, తోట లక్ష్మణ్, బింగి స్వామి తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

