స్నేహితుడి కుటుంబానికి అండగా బాల్య మిత్రులు
కాకతీయ, గజ్వేల్ : చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడం బాధాకరం, అతని కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యత అని 1995–96 ఎస్ ఎస్ సి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు తెలిపారు. చిన్ననాటి నుంచి కలిసి చదివి, పెరిగిన స్నేహితుడి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక అతని కుటుంబానికి తోడుగా నిలవాలని బాల్యమిత్రులు నిర్ణయించారు. గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ, ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన జెయాల యాదగిరి రెండు సంవత్సరాల క్రితం సంగాపూర్ రింగు రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంతో ఖర్చు చేసి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఆయన మృతిచెందాడు. ఆయనకు భార్య, కొడుకు, తల్లిదండ్రులు ఉన్నారు. మిత్రుడి మరణవార్త తెలుసుకున్న బాల్యమిత్రులు మంగళవారం కలిసి యాదగిరి కుటుంబానికి రూ.50 వేల చెక్కుతో పాటు 150 కిలోల బియ్యాన్ని అందజేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

