ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి
నిరుద్యోగ భృతి కింద రూ.3,000 చెల్లించాలి
సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్
కాకతీయ, శంకరపట్నం: రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండేళ్లు దాటుతున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై విమర్శలు గుప్పించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగ యువత కోచింగ్ తీసుకుంటున్నారని, కానీ వారికి తగిన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేవలం 70 వేల ఉద్యోగాల భర్తీతోనే ప్రభుత్వం తన బాధ్యత తీరిపోయిందని భావించవద్దని స్పష్టం చేశారు. ఇప్పటికైనా నిరుద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాలెండర్ ప్రకటించడంతో పాటు, హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు.

