బురుజుల భూములపై వీఎల్టీలు రద్దు చేయాలి
నిరసన దీక్షలకు ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మద్దతు
మూడో రోజుకు చేరిన అఖిలపక్షం ఆందోళన
కాకతీయ, కోరుట్ల: పట్టణ చరిత్రకు ప్రతీకలైన గడి బురుజుల (గ్రామకంఠ/ఆబాది) స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. ఆ భూములపై విధించిన విఎల్టీ లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించారు.
కౌన్సిల్లో తీర్మానం చేస్తాం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడి బురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిపై ఎలాంటి అక్రమాలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తమ పార్టీ కౌన్సిలర్లు ఈ అంశాన్ని అజెండాగా ప్రవేశపెట్టి విఎల్టీల రద్దుకు గట్టిగా పోరాడుతారని తెలిపారు. మిగతా కౌన్సిలర్లు కూడా సహకరిస్తే కౌన్సిల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. ఈ నిరసనకు కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ ఖాన్ సహా పలువురు పాత్రికేయులు, వ్యాపారులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు చెన్న విశ్వనాథం, డా. పేట భాస్కర్, ఎం.డి. ముజాహిద్, చింత భూమేశ్వర్, ఎం.డి. ముజీబుర్ రెహమాన్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, పొతని శేఖర్, గొనే శంకర్ తదితరులు పాల్గొన్నారు.

