సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ కన్నుమూత
కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ (54) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలియగానే హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని పాత్రికేయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ‘చురకలు’ పత్రికతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీనివాస్, ‘సాక్షి’ దినపత్రికలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇటీవల సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ జర్నలిజంలో కొనసాగుతున్నారు. శ్రీనివాస్ జీవితంలో ఒక విషాదకర యాదృచ్ఛికం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం జమ్మికుంటకు వెళ్తుండగా ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి, పట్టుదలతో కోలుకున్నారు. శనివారం గుండెపోటు రావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. గతంలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, సరిగ్గా అదే ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ భౌతికకాయానికి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, నాయిని శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, అల్లి నరేందర్, మండల యాదగిరి తదితరులు నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ గెంటాల సుహాసిని, చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరి, మాజీ ఎంపీపీ ఇరుమళ్ల రాణి తదితర ప్రజాప్రతినిధులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోవడం తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

