రామకృష్ణాపూర్లో వైభవంగా వాసవీ జయంతి
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆలయ నిర్మాణానికి సహకరించాలని మంత్రికి విన్నపం
కాకతీయ, రామకృష్ణాపూర్: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వాసవీ మాత కన్యాకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సూపర్ బజార్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపం వద్ద వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వాసవీ మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గుర్తింపు వల్ల మహనీయుల స్ఫూర్తి అందరికీ చేరుతుందని పేర్కొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో వాసవీ మాత ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని వారు కోరారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించి స్థానిక ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కమిటీ సభ్యులు మరియు మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు.

