కోర్టు వివాదంలో ఉన్న భూమి విక్రయంపై ఆవేదన
న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ డిమాండ్
కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని, తన అనుమతి లేకుండా అక్రమంగా విక్రయించారని బాధితుడు లకావత్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. లకావత్ తులిసియా కుటుంబానికి చెందిన భూమి వారసత్వంగా నలుగురు కుమారులు (రత్న, శంకర్, లక్ష్మణ్, కిషన్), ఒక కుమార్తె (రాంబాయి)కు పంపకం అయింది. నలుగురు సోదరులకు తలా 19 గుంటలు, సోదరికి 4 గుంటలు కేటాయించారు. అయితే, ప్రస్తుతం ఈ హక్కులపై వివాదం నెలకొనడంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో తన తమ్ముడు లకావత్ కిషన్ తన వాటా భూమిని అమ్ముకోవడంలో అభ్యంతరం లేదని, కానీ తనకు చెందిన 19 గుంటల భూమిని కూడా తేజావత్ చందర్ అనే వ్యక్తికి విక్రయించడం అన్యాయమని లక్ష్మణ్ ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు..
“నా భూమిని అమ్మడానికి నువ్వెవరు? కొనడానికి వారెవరు?” అంటూ ఇప్పటికే పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. తాను ఉద్యోగరీత్యా బెల్లంపల్లిలో ఉంటున్న సమయంలో, తనకు సమాచారం ఇవ్వకుండా మంగళవారం భూమి వద్ద గట్టు రాళ్లు పాతిస్తున్నారని తెలిసి వెంటనే 100 డయల్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా భూమి కొలతలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం ఉందని అమాయకులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, కొంతమంది గ్రామస్తులు కూడా ఈ అక్రమ విక్రయానికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు సదరు భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, యథాతథ స్థితిని కాపాడాలని బాధితుడు అధికారులను కోరారు.

