లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సింగపురంలో సమీపంలో విషాదం
మృతుడు జూపాక వాసిగా గుర్తింపు
కాకతీయ, హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని మండలంలోని జూపాక గ్రామానికి చెందిన కేతిరి విక్రమ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీ అతివేగంగా, నిర్లక్ష్యంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

