దోపిడీ మిస్టరీ ముదురుతోంది.. ఐదుగురు కాదు ఆరుగురు?
ధర్మపురి లాడ్జిలో నకిలీ ఐడీలతో మూడు రోజుల బస.. ముందస్తు స్కెచ్ స్పష్టమే
సీసీటీవీ ఫుటేజీలపై పోలీసుల ఫోకస్
కాకతీయ కరీంనగర్ : కరీంనగర్‌లోని పీఎంజే జువెలరీ షాపు దోపిడీ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఐదుగురు నిందితులే ఉన్నారని భావించిన పోలీసులు, తాజా ఆధారాలతో ముఠాలో ఆరుగురు సభ్యులు ఉన్నారని అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా ధర్మపురిలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఈ ముఠా బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట నలుగురు చేరగా, అనంతరం ఇద్దరు విడివిడిగా వచ్చి కలిసినట్లు సాక్షులు వెల్లడించినట్టు సమాచారం. మొత్తం మూడు రోజుల పాటు అక్కడే ఉండి దోపిడీకి ప్రణాళిక రచించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

లాడ్జి రిజిస్టర్‌లు, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. నిందితులు నకిలీ గుర్తింపు కార్డులు చూపించి గదులు తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళిక ఉందని పోలీసులు భావిస్తున్నారు.
కేసు ఛేదన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.

