జమ్మికుంటలో గుర్తుతెలియని మహిళ మృతి
అనాథగా మారిన నాలుగేళ్ల బాలుడు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తుతెలియని మహిళ (సుమారు 25-30 ఏళ్లు) చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న స్టేషన్ టికెట్ బుకింగ్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద సదరు మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జమ్మికుంట ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 10న రాత్రి ఆమె మరణించింది. మృతురాలు నీలం రంగు హాఫ్ ప్యాంట్, పింక్-బ్లూ-ఎల్లో రంగుల డిజైన్ ఉన్న టాప్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అమ్మ కోసం ఎదురుచూస్తున్న చిన్నారి
మృతురాలితో పాటు సుమారు నాలుగేళ్ల వయసున్న బాలుడు ఉన్నాడు. తల్లి మరణంతో ఆ చిన్నారి దిక్కులేనివాడయ్యాడు. రైల్వే పోలీసులు ఆ బాలుడిని సురక్షితంగా చైల్డ్ హోమ్‌కు తరలించారు. ఆ చిన్నారికి మాటలు సరిగ్గా రాకపోవడం, తల్లి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. మృతురాలి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలికి సంబంధించిన ఆనవాళ్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆమె ఏ రైలులో వచ్చింది? ఆమెతో పాటు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9949304574, 8712658604 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ప్రయాణికుల్లో కలకలం
స్టేషన్ ఆవరణలో యువతి మృతి చెందడం, పక్కనే చిన్నారి అనాథగా మిగిలిపోవడం స్థానిక ప్రయాణికులను కలిచివేసింది. అనారోగ్యం కారణంగా మరణించిందా లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది.

