పట్టపగలే బరితెగించిన దొంగలు
ఆరు తులాల బంగారం అపహరణ
తాళం వేసిన రైతు ఇల్లును గుల్ల చేసిన దుండగులు
చేర్యాల పట్టణంలో కలకలం.. పోలీసుల దర్యాప్తు
కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. పట్టణంలోని గడితోట కాలనీలో సోమవారం ఉదయం ఓ రైతు ఇంట్లో చొరబడిన దుండగులు ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గడితోట కాలనీకి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే రైతు సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, ఇదే అదునుగా భావించి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన 6 తులాల బంగారం, రూ. 50 వేల నగదును అపహరించుకుపోయారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్, తలుపులు బద్దలు కొట్టి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సొమ్ము మాయం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అపూర్వ రెడ్డి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలను సేకరించారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

