షార్ట్‌సర్క్యూట్‌తో 70 ఎకరాల్లో మక్కా పంట దగ్ధం
ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కాకతీయ, జమ్మికుంట : రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని, అగ్నిప్రమాదంలో పంట కోల్పోయిన అన్నదాతలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంట మండలం వావిలాల–వంతడుపుల గ్రామాల మధ్య విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 70 ఎకరాల మక్కా పంట పూర్తిగా కాలిపోయింది. మంగళవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించి, కాలిపోయిన చేలను పరిశీలించారు. గోపాలాపూర్, వంతడుపుల గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే బూడిదవ్వడంతో కన్నీరుమున్నీరయ్యారు. బాధితులతో మాట్లాడి నష్టాన్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.
కొనుగోళ్లలో అక్రమాలపై ఆగ్రహం
మక్కల కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. “క్వింటాకు 41 కిలోల బదులు 43 నుంచి 45 కిలోల వరకు తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారు. గూనీ సంచుల కొరత, రైతుబంధు జమలో జాప్యం, కరెంటు కోతలతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు” అని మండిపడ్డారు. ఈ పర్యటనలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిల్ రమేష్, మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ జావిద్ అలీ, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

