అంజనాద్రి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో మహా లింగార్చన
కాకతీయ, కరీంనగర్/ భగత్‌నగర్ : పురుషోత్తమ మాసం (అధిక జ్యేష్ఠ మాసం) సందర్భంగా కరీంనగర్ భగత్‌నగర్‌లోని అంజనాద్రి క్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం గుట్టపై ఆదివారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేములవాడ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.సాయంత్రం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద మంత్రోచ్చారణల నడుమ శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పురుషోత్తమ మాసంలో మహా లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో మహిళలు, యువకులు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో ఆత్మీయత, భక్తి భావన పెంపొందిస్తాయని తెలిపారు.


