ఆఫర్ల పేరుతో సంస్థల మోసాలు
వస్తు విలువకన్నా ఎక్కువ రేట్లతో విక్రయాలు
తయారీ ఖర్చు, జీఎస్టీని ఉత్పత్తులపై ముద్రించడం లేదు
దృష్టి పెట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఏబీజీపీ వినతిపత్రం
కాకతీయ, కరీంనగర్: వినియోగదారులను గరిష్ట రిటైల్ ధర పేరుతో మోసం చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ’ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు ఆ సంస్థ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఏబీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగమల్ల సురేష్, జిల్లా అధ్యక్షుడు నలువాల రాజేందర్, జిల్లా కార్యదర్శి సురభి శ్రీధర్ శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.
డిస్కౌంట్ల పేరుతో మభ్యపెడుతున్నారు
ఈ సందర్భంగా ఏబీజీపీ ప్రతినిధులు మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ కోసం ఉద్దేశించిన ఎమ్మార్పీ , ప్రస్తుతం మార్కెటింగ్ మోసాలకు వేదికగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు తమ ఇష్టానుసారంగా వస్తువులపై అత్యధిక ధరలను ముద్రించి, ఆ తర్వాత భారీ డిస్కౌంట్లు (తగ్గింపులు) ఇస్తున్నామంటూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసలు తయారీ ఖర్చుతో పోలిస్తే మార్కెట్లో వస్తువుల ధరలు అనేక రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని, ఒకే వస్తువుకు ఆన్లైన్, షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాల్లో భారీగా ధరల వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు.
ప్రత్యేక చట్టం తీసుకురావాలి
ఈ విధానం వల్ల వినియోగదారుడికి వస్తువు అసలు ధర, కంపెనీ లాభంపై ఎలాంటి స్పష్టత లేకుండా పోతోందని వారు వివరించారు. ఎమ్మార్పీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తులపై తయారీ ఖర్చు , జీఎస్టీ , మొదటి అమ్మకపు ధరను తప్పనిసరిగా ముద్రించేలా నిబంధనలు తీసుకురావాలన్నారు. అలాగే మోసపూరిత డిస్కౌంట్ ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని, ధరల నియంత్రణ కోసం ఒక స్వతంత్ర అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకై తాము దేశవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

