మూలమలుపుల్లో అప్రమత్తత అవసరం!
రుద్రంగి-మానాల ఘాట్ రోడ్డుపై పెరగని భద్రత
ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలి
అధికారులు స్పందించకుంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవు
త్వరలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం: చందుర్తి సీఐ రవీందర్
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నుంచి మానాల గ్రామానికి వెళ్లే ఘాట్ రోడ్డులో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస మూలమలుపులతో ప్రమాదకరంగా మారిన ఈ రహదారిపై భద్రతా చర్యలు పెంచాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. గుట్టలు, అడవుల మధ్యగా సుమారు 9 కిలోమీటర్ల మేర సాగిన ఈ ఘాట్ రోడ్డులో 12 నుంచి 15 వరకు అంధ మలుపులు (బ్లైండ్ కర్వ్స్) ఉన్నాయి. దీనివల్ల కొత్తగా వచ్చే వాహనదారులకు ఈ దారిపై అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ ఆర్టీసీ బస్సులు, లారీలు, జీపులు, ఆటోలు ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాదకర మలుపుల వద్ద “ప్రమాదకర మలుపు”, “నెమ్మదిగా వెళ్లండి”, “హారన్ ప్లీజ్” వంటి హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రమాదాల అంచున ప్రయాణం
ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు, రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఘాట్ రోడ్డులో ఉన్న ప్రమాదకర మూలమలుపుల వద్ద తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థుడు, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాత్రి సమయంలో ప్రయాణికుల భద్రత కోసం రిఫ్లెక్టర్లు, బారికేడ్లు చాలా అవసరమన్నారు. వీటికి తోడు కనీస డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ యువకులు ఇక్కడ బైక్‌లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, దీనిపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరారు.

