సిరిసిల్లలో “మందుబాబుల వినతి పత్రం” వైరల్!
మద్యం ధరలు పెంచొద్దంటూ కలెక్టర్‌కు లేఖ
సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న పోస్ట్
నెట్టింట మీమ్స్, ట్రోల్స్‌తో నవ్వుల పువ్వులు
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక వినూత్న వినతిపత్రం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. “మద్యం ప్రియుల సంక్షేమ సంఘం” పేరిట జిల్లా కలెక్టర్‌కు రాసినట్లు ప్రచారంలో ఉన్న ఓ లేఖ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ హల్‌చల్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆ లేఖలో మద్యం ప్రియులు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మరోసారి మద్యం ధరలను 20 నుండి 30 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోందని, అలా పెంచితే తాము తట్టుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం కష్టపడే సాధారణ మధ్యతరగతి, కార్మిక వర్గాలపై ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతుందని.. కాబట్టి మద్యం ధరలను పెంచకుండా యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరడం విశేషం.
నెటిజన్ల సరదా కామెంట్లు..
అయితే ఈ వినతిపత్రం నిజంగానే కలెక్టరేట్‌కు వెళ్లిందా? లేక కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఎవరైనా సృష్టించారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, “మందుబాబుల కష్టాలను కూడా ఇంతలా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారంటే నిజంగా గ్రేట్” అంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు “ఇది కూడా ఒక సామాజిక ఉద్యమమే” అంటూ మీమ్స్, ట్రోల్స్‌తో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, సిరిసిల్లలో హల్‌చల్ చేస్తున్న ఈ “మందుబాబుల లేఖ” ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

