రాజన్న క్షేత్రం.. వైభవానికి కొత్త వెలుగులు!
రూ.150 కోట్లతో వేములవాడలో మహా అభివృద్ధి యజ్ఞం
దశాబ్దాల భక్తుల కలలకు కార్యరూపం
ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనుల పురోగతి
దర్శనానికి అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు
రాజన్న క్షేత్ర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు
విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఇప్పుడు చారిత్రక మార్పులకు వేదికగా మారుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉంటూనే, ఆధునిక సౌకర్యాలతో సరికొత్త శోభను సంతరించుకుంటోంది. రూ.150 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆలయ రూపురేఖలనే మార్చేసేలా వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా భక్తులు కోరుకుంటున్న ఆలయ విస్తరణకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం దాల్చింది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, విశాలమైన ప్రాంగణాలు, మెరుగైన దర్శన సౌకర్యాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలతో పనులు చేపడుతున్నారు. సోమవారం ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవస్థానం ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులు, విటిడిఏ ప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరయ్యాయని, దేవాదాయ శాఖ, ఉమ్మడి జిల్లా మంత్రుల సమన్వయంతో పనులు అత్యంత నాణ్యతతో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

సంప్రదాయం..ఆధ్యాత్మికత…
ఆలయ పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూనే నిర్మాణాలను చేపడుతున్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు మహా మండపం, అనిమిటి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాల ప్రాంగణం, ధర్మగుండం తదితర నిర్మాణాలు ఒకేసారి యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్నా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భీమేశ్వర స్వామి ఆలయం ద్వారా ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేస్తూ, భక్తుల రాకపోకలను సులభతరం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

సౌకర్యాల పెన్నిధిగా రాజన్న క్షేత్రం
ఈ విస్తరణ పనులు పూర్తయితే వేములవాడ క్షేత్రం మరింత విశాలంగా, ఆకర్షణీయంగా మారనుంది. భక్తులకు అవసరమైన సౌకర్యాలు గణనీయంగా పెరిగి, దేశవ్యాప్తంగా మరింత మంది భక్తులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. “భక్తుల దశాబ్దాల ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో పనులు వేగవంతం చేశాం. త్వరలోనే భక్తులకు మరింత వైభవమైన దర్శన భాగ్యం కల్పిస్తాం” అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.

