ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
నకిలీ విత్తనాల విక్రేతలకు హెచ్చరిక
రైతులకు నాణ్యమైన సరఫరాపై దృష్టి
కాకతీయ, చిగురుమామిడి : వానకాలం సాగు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం మండల కేంద్రంలోని ఆగ్రోస్తో పాటు పలు ప్రైవేట్ విత్తన, ఎరువుల దుకాణాలపై గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వ్యవసాయ శాఖ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో దుకాణాల్లోని ఎరువులు, విత్తనాల నిల్వలు, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులను మోసం చేసే నకిలీ విత్తనాలు, బిల్లుల్లేని విక్రయాలు, అధిక ధరల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతుల కష్టార్జిత ధనంతో ఎవరైనా చెలగాటం ఆడితే ఉపేక్షించబోమన్నారు. ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై లైసెన్సు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఎరువులను అక్రమంగా తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్లో విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి, రసీదులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మండలంలో సాగుకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

