హోటళ్లలో ‘అపరిశుభ్ర’ భోజనం
గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు
ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులు
నిర్లక్ష్యంగా మారిన ఆహార భద్రత తనిఖీలు
నోటీసులకే పరిమితమా? కఠిన చర్యలు ఎప్పుడు?
నిరంతర నిఘా ఉంచాలని కోరుతున్న వినియోగదారులు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండల కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఆహార భద్రత అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రమం తప్పకుండా జరగాల్సిన తనిఖీలు గాలికి వదిలేయడంతో, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా హోటళ్లలో వంటగదులు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం వంటి నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు సర్వసాధారణంగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన పదార్థాల నాణ్యతపై సందేహాలు ఉన్నప్పటికీ, వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
కఠిన చర్యలు ఎందుకు లేవు?
నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కేవలం నోటీసులతో సరిపెట్టడం కాకుండా, భారీ జరిమానాలు విధించాలని, అవసరమైతే లైసెన్సులను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో రాజీపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా పద్ధతులు మార్చుకునేలా చూడాలని వారు కోరుతున్నారు. ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, ప్రజలకు పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాలి.
అధికారులు ఇప్పటికైనా నిద్ర వీడి, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే హోటళ్లపై కఠినంగా వ్యవహరించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. అధికారులు ఇకనైనా మేల్కొని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

