గీత దాటిన రాఘవ..!
వనమా రాఘవకు దారులు మూసుకున్నాయా?
అధిష్టానం.. అగ్రనేతల్లో తీవ్ర అసహనం..!
సభ్యత్వ నమోదులో రచ్చపై అధిష్టానం సీరియస్
పార్టీలో ఏకాకి అవుతున్న వనమా వారసుడు
సస్పెన్షన్ వేటు తొలగక ముందే మళ్లీ రాజకీయ వివాదంలో
రాజకీయాల్లో వ్యూహాత్మక తప్పిదాలతో భవిష్యత్ గందరగోళం
క్లైమాక్స్‌కు చేరుకున్న రాజకీయ ప్రస్థానం
కాకతీయ, తెలంగాణ బ్యూరో / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వనమా రాఘవేంద్రరావుకు ఇప్పుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే అతిపెద్ద సవాలుగా మారుతోంది. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఆయన ప్రస్థానం, పార్టీ అధిష్టానం చూపుతున్న కఠిన వైఖరితో అంధకారంలోకి నెట్టబడుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వరుస వివాదాలు, పార్టీ అగ్రనేతల అసహనం వెరసి.. రాఘవ రాజకీయ ప్రయాణం ప్రమాదకరమైన మలుపులోకి చేరుకున్నట్లుగా కొత్తగూడెం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తన తండ్రికి అండగా ఉండి, నియోజకవర్గంలో చక్రం తిప్పిన రాఘవ, ఇప్పుడు సొంత పార్టీలోనే ఏకాకి అవుతున్నానే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.

అధిష్టానం ఆగ్రహానికి కారణమిదే
గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జరిగిన రసాభాస ఇప్పుడు రాఘవపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రాఘవ తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయించుకునేందుకు దొరికిన సువర్ణావకాశం. కానీ, అక్కడ జరిగిన రసాభాస, ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావు వ్యాఖ్యలపై రాఘవ ప్రదర్శించిన ప్రవర్తన అధిష్టానం సహనానికి పరీక్షగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీపై నిబద్ధత కంటే ఒంటెద్దు పొకడ,బలప్రదర్శనకే రాఘవ ప్రాధాన్యం ఇచ్చారని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఇది ఆయన సస్పెన్షన్ ఎత్తివేతను కేవలం వాయిదా వేయడమే కాదు, పునరాలోచనలో పడేలా చేసిందంటూ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజకీయ వ్యూహంలో విఫలం
కొత్తగూడెం సీటుపై వద్దిరాజు రవిచంద్ర వంటి నాయకులు పట్టు బిగిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్న తరుణంలోనే ఈ ఘటన జరగడంతో.. ఇప్పుడు రాఘవ పార్టీలో పట్టుకోల్పోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అధిష్టానం దృష్టిని ఆకర్షించాల్సిన రాఘవ, తన ప్రవర్తనతో దూరం చేసుకున్నట్లుగా పార్టీలో ఒక వర్గం బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్టీలో ఒక అభ్యర్థిత్వం కోసం లాబీయింగ్ చేయాల్సింది పోయి, గొడవలకు దిగడం రాజకీయ పరిణతి లేనితనానికి నిదర్శనమని భావిస్తున్నారు. తనపై ఉన్న ‘వివాదాల రాఘవ’ ముద్రను చెరిపేసుకోవడానికి బదులుగా, దాన్ని మరింతగా రుద్దుకున్నారంటూ నిందిస్తున్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా తాత్కాలికంగా పైచేయి సాధించినా, అధిష్టానం ముందు మాత్రం ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయిందంటూ చెబుతున్నారు.
వ్యూహాత్మక తప్పిదాలే పతనానికి కారణమా?
రాజకీయాల్లో వ్యూహాత్మకమైన వైఖరే కీలకమన్నది రాజకీయమెరిగిన నేతలందరికీ తెలుసు. రాఘవ రెండింటి మధ్య సన్నని గీతను దాటేశారని స్పష్టమవుతోంది. సొంత పార్టీ కార్యకర్తలతో వేదికపైనే పైస్థాయి నాయకులను ధిక్కరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకోవడం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న మాట నిజమే అయినా, అది ఇప్పుడు పార్టీ పతనానికి కారణం కాకూడదని అధిష్టానం భావిస్తోందని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం రాఘవ విషయంలో ఇక వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టమవుతోంది. కొత్తగూడెం అభ్యర్థిత్వం విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయం రాఘవకు వ్యతిరేకంగా ఉంటే, ఆయన పార్టీని వీడక తప్పని పరిస్థితి. అందుకే ఆయన చూపు ఇతర పార్టీల వైపు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు కాదు, ఆయన ప్రస్తుత రాజకీయ అభద్రతకు నిదర్శనం అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న రాఘవను చేర్చుకోవడానికి ఇతర పార్టీలు కూడా జంకుతున్నాయన్నది కూడా వాస్తవం అంటూ నిర్మోహమాటమైన అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం. కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్త నాయకత్వం ఎదుగుతోంది. వనమా కుటుంబానికి గతంలో ఉన్న పట్టును ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలు సవాలు చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పుడు పాత తరం మీద కంటే, కొత్త ముఖాల మీద ఫోకస్ చేస్తోంది. ఈ మార్పును రాఘవ జీర్ణించుకోలేకపోవడమే ఆయన రాజకీయ వైఫల్యానికి ప్రధాన కారణం. తనను తాను రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆయన విఫలమయ్యారంటూ ఆయనపై అభిమానం ఉన్న నేతలు సైతం నిందిస్తున్నారు.
క్లైమాక్స్‌కు చేరుకున్న రాజకీయ ప్రస్థానం
రాజకీయ వ్యూహాల్లో దారుణంగా విఫలమవుతున్న రాఘవ ప్రయాణం క్లైమాక్స్‌కు చేరుకుందన్న అభిప్రాయం కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాల్లో జోరుగా సాగుతుండటం గమనార్హం. నియోజకవర్గంలో ఆయన వర్గం ఆందోళన చెందుతుండటం, ప్రత్యర్థి వర్గాలు బలపడుతుండటం ఆయన రాజకీయ పతనానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. తనపై ఉన్న కేసుల నుంచి, వివాదాల నుంచి బయటపడాలంటే ఆయనకు పార్టీ అండ తప్పనిసరి. కానీ ఆ అండను పోగొట్టుకుంటున్న రాఘవ ఇక ఒంటరిగా రాజకీయ ప్రయాణం చేయడం సాధ్యమేనా? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని రాఘవకు తెలియంది కాదనుకుంటా.. కానీ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన చేసే పోరాటంలో గెలుపు కంటే ఓటమే ఎక్కువగా కనిపిస్తుండటం వెనుక ఆలోచనలతో పాటు తొందరపాటు నిర్ణయాలు..నిర్ణయాల్లో స్పష్టత లేమి, వ్యూహాత్మకత లేకపోవడమే కారణమంటూ రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.

