మణుగూరులో ‘అవినీతి’ జాతర
దశాబ్దకాలంగా తిష్టవేసిన ఇద్దరు మహిళా అధికారులు సరిత, మాధవి
మునిసిపల్ ఆర్డీ కార్యాలయం నుంచి అండదండలు
నగదు నజరాజనాలతో అధికారుల నోళ్లు మూయిస్తున్న వైనం
ఆర్డీ పర్యటనలో చేపలు, రొయ్యల విందుపై డిపార్ట్మెంట్లో చర్చ
ఫిర్యాదులెన్ని వచ్చినా చర్యలు లేకపోవడంపై విస్మయం
ఉన్నత స్థాయి విచారణ చేపడితే వెలుగులోకి రానున్న అక్రమాలు
కాకతీయ,మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్రమ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సరిత, మాధవి అనే ఇద్దరు మహిళా అధికారులు దశాబ్ద కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై వస్తున్న ఫిర్యాదుల విషయంలో పైస్థాయి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న వరంగల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) మణుగూరులో పర్యటించిన ప్రతిసారీ, స్థానిక అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఆయన పర్యటన సందర్భంగా చేపలు, రొయ్యల వంటి ప్రత్యేక విందులతో పాటు, భారీగా నగదు నజరానాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన మర్యాదలు, ఆతిథ్యాల వల్లనే స్థానిక అధికారులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలవుతున్నాయని, ఎటువంటి చర్యలు ఉండటం లేదని డిపార్ట్మెంట్లోనే చర్చ జరుగుతోంది.
ఫిర్యాదులపై విచారణ లేదు..చర్యల్లేవు..!
మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై, అధికారుల నిర్లక్ష్యంపై పలుమార్లు ఫిర్యాదులు అందినప్పటికీ, ఎటువంటి విచారణ జరగకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఒకే చోట తిష్టవేసిన అధికారులు, ఆర్డీ కార్యాలయం నుంచి అందుతున్న పరోక్ష అండదండలతోనే తమకు ఏమీ కాదనే ధీమాతో ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలను పక్కనపెట్టి యథేచ్ఛగా సాగిస్తున్న ఈ వ్యవహారాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది.
విచారణ జరిపితేనే అసలు నిజాలు
స్థానిక అధికారులు, పైస్థాయి అధికారుల మధ్య ఉన్న ఈ ‘అక్రమ బంధం’పై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మణుగూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై, ఆర్డీ స్థాయి అధికారుల పర్యటనల తీరుపై పారదర్శకమైన ఉన్నత స్థాయి విచారణ చేపడితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు.

