భార్యపై దాడి.. బామ్మర్దిపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్
* జాలపల్లి గ్రామ శివారులో పట్టుకున్న పోలీసులు
* 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
కాకతీయ, మద్దూర్ :ఉమ్మడి మద్దూర్ మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన బంధారం రమేష్ తన భార్య, పిల్లలను వేధించి దాడి చేయడంతో పాటు, భార్య తరఫు బంధువులపై కూడా దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం జూన్ 15వ తేదీ రాత్రి రమేష్ తన భార్య, పిల్లలను కొట్టాడు. విషయం తెలుసుకున్న అతని బామ్మర్ది తాళ్లపల్లి ప్రతాప్, అత్తతో కలిసి కారులో జాలపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా రమేష్ వారు వచ్చిన కారుపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశాడు. అనంతరం కళ్లు గీసే కత్తితో ప్రతాప్‌పై దాడి చేసి గాయపరిచాడు.బాధితుల ఫిర్యాదు మేరకు మద్దూర్ పోలీసులు హత్యాయత్నం, భార్య వేధింపులు, ఆస్తి ధ్వంసం తదితర నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితుడు బంధారం రమేష్‌ను జూలై 9 గురువారం జాలపల్లి గ్రామ శివారులో అరెస్ట్ చేసి చేర్యాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, అనంతరం సిద్ధిపేట జిల్లా జైలుకు తరలించారు.

