స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మకం
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన యాజమాన్యం
అధిక ధరలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ
గోడౌన్ను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ డిమాండ్
ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద పీడీఎస్యూ ధర్నా
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్. మిషనరీ హైస్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం ఆ పాఠశాల పుస్తకాల గోడౌన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్.ఎఫ్.ఎస్. మిషనరీ పాఠశాల యాజమాన్యం పుస్తకాలపై ప్రత్యేక లోగోలు వేయించి, తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని విద్యార్థులపై, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. అడ్మిషన్ల సమయంలోనే యూనిఫామ్స్ కూడా తమ వద్దే తీసుకోవాలని నిబంధనలు పెడుతూ, వేల రూపాయలను దండుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారి, నిబంధనలను తుంగలో తొక్కుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
అధికారులు సీజ్ చేయాలి
ప్రైవేటు విద్యాసంస్థల్లో మిషనరీ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తున్న గోడౌన్లను వెంటనే సీజ్ చేయాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని మిగిలిన విద్యాసంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టాలని పీడీఎస్యూ నేతలు విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి సాదిక్, జిల్లా నాయకులు హరిచంద్ర ప్రసాద్, సుశాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

