కాకతీయ ఎఫెక్ట్..
ఎస్సారెస్పీ భూముల్లో పైపులైన్ తొలగింపు
కథనంపై స్పందించిన ఎస్సారెస్పీ అధికారులు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈ పావని
ఎస్సారెస్పీ భూములను పరిరక్షిస్తాం : ఏఈ పావని స్పష్టీకరణ

కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎస్సారెస్పీ ప్రభుత్వ భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారంటూ సోమవారం ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఎస్సారెస్పీ డీఈ నవీన్, ఏఈ పావని మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భూమిలో ఏర్పాటు చేసిన పైపులైన్‌ను అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఏఈ పావని సంబంధిత వ్యక్తులను ఫోన్లో సంప్రదించి పైపులైన్ ఏర్పాటు విషయంపై ఆరా తీశారు. అయితే తాము పైపులైన్ ఏర్పాటు చేయలేదని, తమ పొలానికి చెందిన అనిల్ తదితరులు వేసి ఉండవచ్చని వారు సమాధానం ఇచ్చినట్లు ఏఈ తెలిపారు. పైపులైన్ ఏర్పాటు చేసిన విషయంపై స్పష్టత కోసం అనిల్‌ను సంప్రదించగా, ఎస్సారెస్పీ భూముల్లో తాము ఎలాంటి పైపులైన్ ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తమపై వస్తున్న ఆరోపణలకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
భూమిలో చెట్లు నాటే యోచన
ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే ఎంపీడీవోకు సమాచారం అందించినట్లు ఏఈ పావని తెలిపారు. సదరు భూమిలో చెట్లు నాటాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చెట్లు నాటించి ప్రభుత్వ భూమిని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పైపులైన్‌ను తొలగించడంతో ఎస్సారెస్పీ భూముల పరిరక్షణపై చర్యలు ప్రారంభమైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇకపై ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో లష్కర్ అభినయ్ పాల్గొన్నారు.

