ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం
విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలి
సోషల్ మీడియాను విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి వినియోగించాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
కాకతీయ, నిజామాబాద్ : పట్టణంలో నిర్మించనున్న నూతన గ్రంథాలయాన్ని ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా అభివృద్ధి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన పుస్తకాలు, డిజిటల్ వనరులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అవసరమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన విషయాలు మరింత ప్రాసంగికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలి
యువతపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దాని వినియోగంలో విచక్షణ అవసరమని మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. సోషల్ మీడియాను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా విద్య, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు గ్రంథాలయాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు పొందేలా ప్రోత్సహించాలని అన్నారు. నూతన గ్రంథాలయం నిజామాబాద్ పట్టణంలోని విద్యార్థులు, యువతతోపాటు ప్రజలందరికీ విజ్ఞాన కేంద్రంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రంథాలయ నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

