ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం
నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించిన హుజూరాబాద్ కోర్టు
కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి రూ.3.60 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలికి న్యాయస్థానం రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన క్రైమ్ నంబర్ 63/2016, ఐపీసీ 420 సెక్షన్ కేసులో జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి గంగ అలియాస్ గామనిక ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని గడ్డి కిరణ్, గడ్డి సంతోష్, గడ్డి మహేష్‌లను నమ్మించింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల చొప్పున మొత్తం రూ.3.60 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఎల్. శ్రీను విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం హుజూరాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.బి. కిరణ్ నిందితురాలికి రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-II కె. ఝాన్సీ వాదనలు వినిపించారు.కేసు విచారణకు సహకరించిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె. సురేష్‌తో పాటు సంబంధిత పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రస్తుత కేశవపట్నం ఎస్సై ఎన్. నరేష్ రెడ్డి ప్రజలకు సూచించారు.

