నిబంధనల మేరకే వెంచర్లకు అనుమతులు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : భూమి అభివృద్ధిలో భాగంగా వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో వెంచర్ ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ తో కలిసి ఆయన పరిశీలించారు. వెంచర్ల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను సరిచూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని, పూర్తిస్థాయిలో రికార్డులు సక్రమంగా ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని సూచించారు. భూమి అభివృద్ధి ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రికార్డుల పరిశీలన అత్యవసరం
మున్సిపల్ పరిధిలో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేసే క్రమంలో పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించే సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను రికార్డులతో సరిపోల్చుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి సంపత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

