చేర్యాలలో వైభవంగా వాసవీ మాత జయంతి
భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ.. ప్రత్యేక పూజలు
ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఆర్యవైశ్య భవనం
కాకతీయ, చేర్యాల : మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి ఆర్యవైశ్య భవనం వరకు శోభాయాత్రగా పల్లకి సేవను చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య భవనంలో పురోహితులు గణేశ పూజ, వాసవి అభిషేకం, అష్టోత్తర, కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి పారాయణం, చాలీసా పఠించారు. భక్తుల భజనలు, కీర్తనలతో భవన ప్రాంగణం ఆధ్యాత్మికతతో పులకించింది. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు లాభసాటిగా సాగాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు తెలిపారు.

సంస్కృతిని చాటిచెప్పేలా..
వచ్చే తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించేందుకే ఇలాంటి వేడుకలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. పిల్లలకు వాసవీ మాత చరిత్రను వివరించి, అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ గుప్త, తడక లింగం గుప్త, శేరి బాల నారాయణ గుప్త, ఉప్పల నాగరాజు గుప్త, మంచాల కొండయ్య గుప్త, తేరాల శ్రీనివాస్, దిడిగం నర్సింహులు, తాళ్లపల్లి శ్రీనివాస్, ఓరుగంటి శ్రీకాంత్, పెద్ది రమేష్ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.

