నిద్రమత్తు.. నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచిన డ్రైవర్!
అదుపుతప్పి బోల్తా పడిన సబ్బులు మరియు సర్ఫ్ లోడు లారీ
చేర్యాల మండలంలోని వీరన్నపేట శివారులో తెల్లవారుజామున విషాదం
కాకతీయ, చేర్యాల : వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకోవడంతో ఓ లారీ అదుపు తప్పి రహదారి పక్కనే బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పక్కనే ఉన్న క్లీనర్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ శివారులో ఉన్న మహేశ్వర రైస్ మిల్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుండి సిరిసిల్ల వైపు లోడుతో వెళ్తున్న లారీ వీరన్నపేట శివారుకు చేరుకోగానే, డ్రైవర్ తీవ్ర నిద్రమత్తులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. లారీ క్యాబిన్‌లో నలిగిపోయి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే కూర్చున్న క్లీనర్ తీవ్ర గాయాలతో కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే చేర్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్లీనర్‌ను చికిత్స నిమిత్తం తక్షణమే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం ఆసుపత్రి మార్చురీకి పంపించారు. ఈ ఘోర ప్రమాదంపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

