ఈటల ఫ్లెక్సీల కలకలం!
“రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు”..
హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వెలిసిన ఫ్లెక్సీలు
సొంత పార్టీలోనే అంతర్గత అసంతృప్తా?
కాకతీయ, కరీంనగర్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అకస్మాత్తుగా వెలిసిన ప్రచార ఫలకాలు (ఫ్లెక్సీలు) రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ ఫ్లెక్సీలలో “ఈటల ఏడుపే బీజేపీకి శాపం”, “రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు” అంటూ ఆయనను నేరుగా విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు రాయడం రాజకీయంగా పెద్ద ప్రాధాన్యం సంతరించుకుంది. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాలతో పాటు, ఆయన పాత నియోజకవర్గమైన హుజూరాబాద్ ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది. వేర్వేరు జిల్లాల్లో, వేర్వేరు ప్రాంతాలలో ఒకేసారి ఈ తరహా వ్యతిరేక ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో.. వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త చర్చకు తెర..
హుజూరాబాద్ రాజకీయాల నుండి మల్కాజిగిరి పార్లమెంట్‌కు వెళ్లి అక్కడ ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన రాజకీయ వైఖరిపై ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిగ్గా ఆయనను టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు రావడం బీజేపీలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ ఫ్లెక్సీలను అర్ధరాత్రి పూట ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఇది ఇతర రాజకీయ ప్రత్యర్థి పార్టీల వ్యూహాత్మక చర్యా? లేక బీజేపీలోనే ఈటల ఎదుగుదలను నచ్చని వారి అంతర్గత అసంతృప్తి ప్రతిఫలమా? అనే కోణాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ ఫ్లెక్సీల వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు బీజేపీ శ్రేణుల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది.

