చేర్యాలలోవ్యాధుల భయం
చైర్‌పర్సన్ వార్డులోనే దారుణ పరిస్థితి
ఇలా ఉంటే పట్టణ అభివృద్ధి ఎలా సాధ్యం?
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 6వ వార్డులోనే పారిశుధ్యం పడకేసింది. వినాయక మార్ట్ ఎదురు వీధి కాలనీలో ఉన్న ఒక బావి చెత్త వ్యర్థ పదార్థాలు, మురుగు నీటితో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో బావిలో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు, క్రిమికీటకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వైరల్ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, వెంటనే మురుగు నీటిని తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యమే!
స్వయంగా మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులోనే ఈ దయనీయ పరిస్థితి ఉంటే ఇక చేర్యాల పట్టణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై గతంలోనే మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శిస్తూ, తక్షణమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు నిలదీస్తున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం
ముస్త్యాల అరుణ, మున్సిపల్ ఛైర్ పర్సన్
వార్డులో మురుగు నీటితో నిండిన బావిని త్వరలోనే పూడ్చివేస్తామని ఛైర్‌పర్సన్ తెలిపారు. ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం బావిని పూడ్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఛైర్ పర్సన్ అరుణ స్పష్టం చేశారు


