- యువజన కాంగ్రెస్ నాయకుడి వ్యవహారం దుమారం
- ముగ్గురు కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేసినట్లు ప్రచారం
- మంత్రుల పేర్లు చెప్పుకుంటూ హల్చల్?
- అధికారిక స్పందన కోసం ఎదురుచూపులు
కాకతీయ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన ఘటన ప్రస్తుతం చేర్యాల మండలంతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన ఓ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఓ మహిళతో ఫామ్‌హౌస్‌లో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోవడం, అనంతరం జరిగిన పరిణామాలు స్థానికంగా సంచలనంగా మారాయి. సమాచారం మేరకు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి చేరుకుని సంబంధిత నాయకుడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం వారి మధ్య బేరసారాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన స్నేహితుడి ద్వారా ఫోన్‌పే ద్వారా కొంత మొత్తం డబ్బు బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మరో కానిస్టేబుల్ కూడా అక్కడికి చేరి వారితో కలిసి ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ముగ్గురు కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మెమోల జారీపై కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మంత్రుల పేర్లు చెప్పుకుంటూ హల్చల్..?
సంబంధిత యువజన కాంగ్రెస్ నాయకుడు గత కొంతకాలంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ నాకు అత్యంత దగ్గర రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను అంటూ అమాయక ప్రజలను,ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తనకు ఉన్న రాజకీయ పలుకుబడిని చూపిస్తూ వివిధ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని స్థానికంగా చర్చ జరుగుతోంది.
క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాజా ఘటనతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొంటూ ఆయనపై వెంటనే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలువురు స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
అధికారిక స్పందన కోసం ఎదురుచూపులు
అయితే ఈ ఘటనలో వినిపిస్తున్న ఆరోపణలపై సంబంధిత యువజన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే పోలీసు శాఖ, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ ఘటనపై స్పష్టత రావాలంటే అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

