రోడ్డు దుస్థితితో తృటిలో తప్పిన భారీ ప్రమాదం
* ఇంటివైపు ఒరిగిన పెట్రోల్ ట్యాంకర్..
* అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
* మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు
కాకతీయ, చేర్యాల: చేర్యాల అంగడి బజారు నుంచి పెద్దమ్మ గడ్డకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతింది. రహదారి పక్క భాగం కుంగిపోవడంతో శుక్రవారం ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంటివైపు ఒరిగి నేలకొరిగింది. ట్యాంకర్లో పెట్రోల్ ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
ఈ ఘటనతో రహదారి దుస్థితి మరోసారి బహిర్గతమైంది. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు ప్రయాణిస్తుండగా ప్రతి రోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర సేవల వాహనాలు సైతం ఈ రహదారిపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల కథనం ప్రకారం, ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.ప్రమాదం జరిగితేనే అధికారులు మేల్కొంటారా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా?” అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్యలు ఎప్పుడు?
ప్రమాదం జరిగిన తర్వాత కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతుల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఈ ఘటనతోనైనా అధికారులు కళ్లు తెరవాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు స్పందించి వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, మరో ప్రాణాపాయం జరిగేలోపు రహదారిని పూర్తిగా పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల గళం
ఫిర్యాదులు చేస్తే పట్టించుకోరు… ప్రమాదం జరిగితేనే అధికారులు వస్తారా?” అంటూ చేర్యాల అంగడి బజారు–పెద్దమ్మ గడ్డ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“రహదారి దుస్థితిపై ఎన్నిసార్లు మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హామీలు తప్ప పనులు చేయలేదు. నేడు పెట్రోల్ ట్యాంకర్ ఇంటివైపు ఒరిగినా అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ పేలుడు జరిగి ఉంటే అమాయక ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహించేవారు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.”ఇంకా నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదం తప్పదు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు” అంటూ స్థానికులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

