జై భవానీ స్మరణలతో మార్మోగిన పురి వీధులు
భక్తి పారవశ్యంలో రాయపర్తి.. ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
కన్నుల పండువగా దేవి శోభాయాత్ర.. భక్తుల జయ జయద్వానాల నడుమ నిమజ్జనం
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ప్రధాన వీధులన్నీ జై భవానీ జై జై భవానీ నామస్మరణలతో మార్మోగాయి.గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధల నడుమ సాగిన శ్రీదేవి చరణ్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం నాటి నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిశాయి.తొమ్మిది రోజులపాటు అమ్మవార్లు శ్రీ బాలత్రిపుర సుందరి,గాయత్రీ దేవి,అన్నపూర్ణాదేవి,లలితా త్రిపురసుందరి,మహాలక్ష్మి, సరస్వతీ దేవి,దుర్గాదేవి,మహిషాసుర మర్దిని,శ్రీ రాజరాజేశ్వరి దేవి విశేష అలంకరాల్లో భక్తులకు అభయమిచ్చారు.ఉత్సవాల్లో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక లలితా నామ పారాయణం, కుంకుమార్చనలు,చండీ హోమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు,కోలాటాలు,భజనలు నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పలుచోట్ల భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

కోలాహలంగా శోభాయాత్ర
బుధవారం సాయంత్రం నుంచి మండల వ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు కోలాహాలంగా ప్రారంభమయ్యాయి.పూలతో,విద్యుత్ దీపాలతో,ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై అమ్మవార్ల విగ్రహాలను శోభాయాత్రగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు,తీన్మార్ డాన్సులు,భక్తుల జయ జయధ్వనాల నడుమ యాత్ర కన్నుల పండుగగా సాగింది. గ్రామాల ప్రధాన వీధుల గుండా ఊరేగింపు సాగుతుండగా ఇళ్ళ ముందుకు వచ్చిన మహిళలు అమ్మవార్లకు నీళ్లు ఆరబోసి,కొబ్బరికాయలు కొట్టి,కర్పూర హారతులు పట్టారు.అనంతరం స్థానిక చెరువులు వద్ద శాస్త్రోప్తంగా పూజలు నిర్వహించి అమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు.ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

